అంతర్మథనంలో జనసేన ఎమ్మెల్యే రాపాక

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: ఏ రాజకీయ పార్టీ అయినా దానిని నడిపించే నాయకుడి విశ్వసనీయత, చిత్తశుద్ధి పైనే మనుగడ సాగిస్తుంది. పార్టీ నాయకుడు పూటకో పాట పాడుతూంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎంత కాలమని కొనసాగుతారు! రోజులు, నెలలు.. ఆ తరువాత ఏం చేస్తారు! తలోదారి చూసుకోకుండా ఎలా ఉంటారు! జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. జనసేనానిగా   చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విధానాలు, నిర్ణయాలు మొదటి నుంచీ ఎప్పుడూ స్థిరంగా లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఉధృతంగా నడిచిన సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదన వరకూ అన్నింటా ఆయన మాటలు మారుస్తూ వస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న ఈ వైఖరి ఆ పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరగడంతో విభజన అనంతరం మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెబుతాడు. అటువంటి పరిస్థితి మరోసారి ఎదురు కాకూడదనే ముందుచూపుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు హర్షిస్తున్నారు. కానీ.. ఎన్నికల ముందు తన మనసుకు కర్నూలే రాజధాని అని ప్రకటించిన జనసేనాని ఇప్పుడేమో దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు మౌత్‌పీస్‌గా పవన్‌ మారిపోయారనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. అధినేత అయోమయ, అస్తవ్యస్త విధానాలను జనసేన శ్రేణులు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తీరు నచ్చక జిల్లాలో ఒకరొకరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు.


గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్‌ కల్యాణ్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు. రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ గెలుపొందిన ఏకైక స్థానం షెడ్యూల్‌ కులాలకు రిజర్వ్‌ అయిన మన జిల్లాలోని రాజోలు నియోజకవర్గం. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా బొటాబొటీ మెజారిటీతోనే బయటపడ్డారు. అటువంటి నియోజకవర్గంలో సైతం జనసేన నాయకులు అధినేత పవన్‌ విధానాలు నచ్చక గుడ్‌బై చెబుతున్నారు. జనసేనను వీడుతున్న నాయకులందరూ వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వాసంతో ఆ పార్టీలో చేరుతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, గెడ్డం తులసీ భాస్కర్, కేఎస్‌ఎన్‌ రాజు, ముప్పర్తి త్రిమూర్తులు, గుబ్బల మనోహర్, కంచర్ల శేఖర్‌ వంటి ముఖ్య నాయకులు జనసేనను వీడిపోయారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే రాపాకను అంతర్మథనంలో పడేశాయి. జనసేనకు దూరమైపోతున్న వారిని ‘వెళ్లిపోకండ’ని బుజ్జగించే ప్రయత్నం కూడా రాపాక చేయలేకపోతున్నారు. వరుస వలసలతో పార్టీలో చివరకు ఏకాకిగా మిగులుతారని రాపాక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు.

సీఎం జగన్‌కు మద్దతుగా..: ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు రాపాక మద్దతుగా నిలుస్తున్నారు. అమలాపురంలో జరిగిన ‘వాహనమిత్ర’ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో పాటు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో కూడా రాపాక పాల్గొన్నారు. సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నందువల్లనే రాపాక సానుకూలంగా ఉంటున్నారనేది నిర్వివాదాంశం. రాష్టం మొత్త్తంమీద తనను మాత్రమే గెలిపించిన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ తోడ్పాటు అనివార్యం. అందుకే ప్రభుత్వ ముఖ్యులతో ఆయన టచ్‌లో ఉంటున్నట్టు చెబుతున్నారు. రాపాకకు రాజకీయ భిక్ష పెట్టిన మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ఇటీవలే వైఎస్సార్‌ సీపీలోకి తిరిగి వచ్చేశారు. మలికిపురం మండలం చింతలమోరికి చెందిన రాపాక వరప్రసాద్‌కు రాజకీయ వారసత్వం లేకపోలేదు.

హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదాయన. ఆయన తండ్రి వెంకట్రావు పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. గల్ఫ్‌లో కొంతకాలం ఉండి తిరిగి వచ్చిన వరప్రసాద్‌ టీడీపీలో చేరి అప్పటి డిప్యుటీ స్పీకర్‌ ఏవీ సూర్యనారాయణరాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీలకు రిజర్వ్‌ అయిన రాజోలులో అల్లూరు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పోటీ చేయలేదు. తిరిగి 2019లో జనసేన నుంచి పోటీ చేసిన రాపాక.. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా ఉండేవారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావానికి ముందే ఓదార్పు యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడిచారు. వర్తమానంలోకి వస్తే.. జనసేన నాయకులు ఆ పార్టీని వీడిపోతూండడంతో రాపాక డోలాయమాన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన రాజకీయ పయనం ఎలా ఉంటుందా అనే చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరుగా జరుగుతోంది.


పార్టీ అధినేత వైఖరితో విభేదిస్తూ.. : పవన్‌ ‘రైతు సౌభాగ్య దీక్ష’కు రాపాక దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందు వల్లనే హాజరు కాలేదని ఆయన చెప్పినా.. ఈ దీక్ష రాజకీయ ప్రచారం కోసమేనన్న అభిప్రాయంతోనే ఆయన దీనికి దూరంగా ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ తరుణంలో రైతు సమస్యలపై పవన్‌ అసందర్భంగా చేసిన దీక్షను రాపాక సహా అనేకమంది నేతలు వ్యతిరేకించారని అంటున్నారు. ఆంగ్ల భాష అమలుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం నిర్ణయాన్ని రాపాక సమర్థించడం కూడా అదే సమయంలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ నుంచి రాపాకకు షోకాజ్‌ నోటీసు జారీ అయిందని, సొంత కేడర్‌ బలంతోనే తాను గెలుపొందానంటూ పవన్‌కు వ్యతిరేకంగా రాపాక ఘాటైన లేఖ రాశారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

1 view0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్