దీనినే ఉగ్రవాదం అంటారా: సీఎం కుమార్తె


న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది అంటూ బీజేపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. రాజకీయాలంటేనే బురద అంటారు.. అయితే అవి ఇప్పుడు మరింత దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. ఉచితంగా వైద్య సేవలు అందించడం, పిల్లలలకు మంచి విద్య అందించడాన్ని ఉగ్రవాదం అంటారా అని ప్రశ్నించారు. విద్యుత్‌, నీటి సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నందుకు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అంటున్నారా అంటూ బీజేపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. కాగా ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆప్‌, బీజేపీ ప్రచార జోరును పెంచాయి. పరస్పరం విమర్శల దాడికి దిగుతూ.. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ సహా మరికంత మంది నాయకులు కేజ్రీవాల్‌ ఓ ఉగ్రవాది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.(ఢిల్లీలో మళ్లీ ఆప్‌కే ఎందుకు పట్టం!?)

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ కుమార్తె హర్షిత బుధవారం మాట్లాడుతూ... ‘‘మా నాన్న ఎన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన క్రమశిక్షణ కలిగిన మనిషి. రోజూ ఉదయం ఆరు గంటలకే నన్ను, మా అమ్మను, సోదరుడిని నిద్రలేపేవారు. భవద్గీత చదివించేవారు. సోదర భావం పెంపొందించేందుకు.. ‘ఇన్‌సాన్‌ సే ఇన్‌సాన్‌ కా హో భాయిచారా’  వంటి  పాటలు పాడిస్తూ వాటి అర్థం చెప్పేవారు. ఇది టెర్రరిజమా? లేదా అందరికీ విద్య అందించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం ఉగ్రవాదమా? ఎలాంటి ఆరోపణలైనా చేసుకోండి.. 200 మంది ఎంపీలను, 11 మంది ముఖ్యమంత్రులను తీసుకువచ్చుకోమని చెప్పండి. మేమే కాదు.. 2 కోట్ల మంది సామాన్యులు ఆప్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11న వారు వేసే ఓట్లే మా నాన్నపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు తప్పు అని నిరూపిస్తాయి’’అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత, ఆయన కుమార్తె హర్షిత ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

2 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్